కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చిత్తశుద్ధితో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే.. దానిని కాంగ్రెస్, వారి ఇండియా కూటమి మిత్రపక్షాలు కుట్రలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) మండిపడ్డారు. గతంలో మతం, కులం పేరుతో దేశాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ‘ఉత్తర – దక్షిణ’ (North-South) అంటూ ప్రాంతీయ చిచ్చు పెడుతూ దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఈ ప్రమాదకరమైన విద్వేష రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో దేశమంతా ఒకటేనని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని.. అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్లు సాకారమైన సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ ప్రధాని మోదీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

