కలం, కరీంనగర్ బ్యూరో: ‘సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్‌లో సింగరేణి హెచ్‌ఓడీ అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన (Cyber Crime Awareness) సదస్సు నిర్వహించారు. ఇందులో స్టాక్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఓటీపీ–కేవైసీ మోసాలు, నకిలీ లింకుల ద్వారా జరిగే మోసాలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డీప్‌ఫేక్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేసి సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈసారి ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు30 శాతం ఇన్వెస్ట్‌మెంట్ మోసాలేనని, పొదుపు చేసిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకునే ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారినే సైబర్ నేరగాళ్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రజల వ్యక్తిగత వివరాలు, ఆన్‌లైన్ అలవాట్లు, సోషల్ మీడియా వినియోగం, ఇంటర్నెట్‌లో చేసే శోధనలను విశ్లేషించి వారి మనస్తత్వానికి అనుగుణంగా ఆకర్షణీయమైన ప్రకటనలు,పెట్టుబడి అవకాశాల పేరుతో ఉచ్చులోకి దింపుతున్నారని హెచ్చరించారు. వేల మందిని సంప్రదించినా ఒక్కరూ మోసపోయినా నేరగాళ్లకు భారీ లాభాలు వస్తాయని తెలిపారు. బ్యాంకులో డబ్బు ఉండటం మాత్రమే భద్రత కాదని, ఆన్‌లైన్‌లో ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండటమే నిజమైన భద్రత అని స్పష్టం చేశారు.
అధిక లాభాల హామీలు, తెలియని లింకులు, అనుమానాస్పద యాప్‌లు,పెట్టుబడి ఆహ్వానాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా “ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు” అని చెబితే అది సైబర్ మోసానికి పెద్ద హెచ్చరికగా భావించాలని సూచించారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే కుటుంబ సభ్యులు, సహచరులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా, డబ్బు నష్టం జరిగినా లేదా జరగకపోయినా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
త్వరితగతిన ఫిర్యాదు చేస్తే సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లపై చర్యలు తీసుకుని నేరగాళ్లను గుర్తించే అవకాశం పెరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాల సమాచారాన్ని దాచిపెట్టకుండా పోలీసులకు తెలియజేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కార్యాలయంలో అధికారులు,హెచ్‌ఆర్ విభాగాలు తమ ఉద్యోగులకు తరచూ సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఐదు నిమిషాల అవగాహన కూడా అనేక కుటుంబాలను సైబర్ మోసాల నుంచి రక్షించగలదని తెలిపారు. ప్రజలు, సంస్థలు, పోలీసు శాఖ పరస్పర సహకారంతో విశ్వసనీయ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.సైబర్ భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. అప్రమత్తతే సైబర్ మోసాలకు శాశ్వత నివారణ అని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, రామగుండం సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్జల్, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రాణా ప్రతాప్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు,సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు మారుతి, క్రాంతి, సింగరేణి హెచ్‌ఓడీ అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

