కలం, మోత్కూరు: పంట పొలాలకు కనీసం 7 గంటల ఉచిత విద్యుత్ కూడా అందడం లేదని మోటకొండూరు (Motakondur) రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు (Harish Rao) సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అయితే తాను వస్తున్న విషయం ముందుగానే తెలియడంతో సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌లను మాయం చేశారని ఆయన ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, ప్రజా సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు రైతుల సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల ఆస్తుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే, తాము న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తుల వద్దకు వెళ్లి పరిశీలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బఫర్ జోన్లలో నిర్మించిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌస్‌ల వద్దకు వెళ్లి పరిశీలించే ధైర్యం ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా ప్రజా సమస్యలపై వారిని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు అన్నారు. ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై దృష్టి పెట్టడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పంట పొలాలకు విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

