భారత్-కివీస్ సిరీస్: స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి?

కలం, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టుకు షెడ్యూల్ (Ind vs NZ Series) రద్దీ పెద్ద సవాలుగా మారింది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్ అక్కడ ఐదు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వైట్ బాల్ సిరీస్ అక్టోబర్ 22న ప్రారంభమై నవంబర్ 15 వరకు సాగుతుంది. అయితే ఆఖరి వన్డే ముగిసిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నవంబర్ 19 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ తక్కువ వ్యవధి ఆటగాళ్ల సన్నద్దతపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.

ఈ షెడ్యూల్ ఒత్తిడిని అధిగమించేందుకు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. చివరి రెండు వన్డేలకు శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఆటగాళ్లు రెండు ఫార్మాట్లలోనూ కీలకమైనందున టెస్టు సిరీస్ కోసం వీరి పనిభారాన్ని తగ్గించడమే జట్టు ప్రధాన లక్ష్యం.

దీనికి తోడు కోచింగ్ సిబ్బందిని కూడా రెండు బృందాలుగా విభజించే అవకాశం ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మోర్నే మోర్కెల్, సితాంశు కోటక్, శుభదీప్ ఘోష్‌లలో ఇద్దరు కోచ్‌లు వన్డే జట్టుతోనే ఉంటారు. మిగిలిన ఇద్దరు కోచ్‌లు టెస్టు జట్టు ఆటగాళ్లతో కలిసి వెల్లింగ్టన్ వెళ్లి ముందస్తు శిక్షణను పర్యవేక్షిస్తారు. షెడ్యూల్ ఖరారు చేసే సమయంలో తమను సంప్రదించలేదని, దీనివల్ల సన్నాహకాలకు తగిన సమయం దొరకడం లేదని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

ఈ టెస్టు సిరీస్ (Ind vs NZ Series) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో చాలా కీలకం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండగా, భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. వరుస మ్యాచ్‌ల నేపథ్యంలో ఆటగాళ్లకు తగిన విశ్రాంతినిస్తూనే విజయం సాధించడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద పరీక్ష కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>