కలం, కరీంనగర్: ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను గంగుల కుటుంబ సభ్యులు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారికూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గంగుల కమలాకర్ సోదరీమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలత లు తమ సహోదరులైన గంగుల కమలాకర్ తో పాటు వెంకన్న, సుధాకర్‌లకు ఘనంగా రాఖీలు కట్టారు.
తమ సోదరుల ఆయురారోగ్యాలు, క్షేమాన్ని కాంక్షిస్తూ మణికట్టుపై రక్షాసూత్రం కట్టి, ప్రేమతో మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు మాట్లాడుతూ, తాము ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి ఏటా ఈ పండుగ రోజున కచ్చితంగా కలుసుకొని రాఖీ కట్టడం తమ కుటుంబంలో ఆనవాయితీగా వస్తోందని, ఈ బంధం ఎప్పటికీ ఇలాగే నిలవాలని ఆకాంక్షించారు.
కేవలం పెద్దలకే పరిమితం కాకుండా, కుటుంబంలోని తదుపరి తరాల మధ్య కూడా ఈ వేడుకలను అత్యంత సరదాగా జరుపుకున్నారు. గంగుల కమలాకర్ కుమారునికి వారి సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సుధాకర్ కుమారునికి, వెంకన్న కుమారులకు, అలాగే గంగుల ప్రభాకర్ కుమారులకు వారి సోదరీమణులు రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా రాఖీలు కట్టి ఆప్యాయంగా శుభాకాంక్షలు అందజేసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరి జరుపుకున్న ఈ వేడుకలతో గంగుల నివాసంలో సందడి నెలకొంది.

