మక్తల్ మున్సిపాలిటీని సందర్శించిన కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మక్తల్ మున్సిపాలిటీ తీరుపై కలెక్టర్ తీవ్ర అసంపూర్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు . మక్తల్ మున్సిపాలిటీని శుక్రవారం సందర్శించిన కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Collector Priyanka) పట్టణంలో ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్ల వివరాలను పరిశీలించారు. పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతుండటంపై మున్సిపల్ కమిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.

పట్టణంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే చెత్తను తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. చెత్త సేకరణ వాహనాలు నిర్దేశిత ప్రాంతాల్లో సక్రమంగా తిరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని జీపీఎస్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో ఉన్న వార్డు అధికారులు, మొత్తం వార్డుల సంఖ్య తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

మక్తల్‌లో అభివృద్ధి పనులను పరిశీలన

మక్తల్ నియోజక వర్గ కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. ముందుగా మక్తల్ మండలం గొల్ల పల్లి సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే గొల్ల పల్లి శివారులోనే ఆర్టిఫిసియల్ విభాగానికి 9 ఎకరాలు, సెట్విన్ కు 10 ఎకరాల 30 గుంటలు, ఏ టీ సీ కి 1.5 ఎకరాలు, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ కు 20 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు అధికారులు వివరించారు. అలాగే మక్తల్ లో కొనసాగుతున్న ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనుల పరిశీలన

అనంతరం మక్తల్ సమీపంలోని 916/2, 917/2 సర్వే నంబర్లలోని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన A, B, C, D బ్లాక్ పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలపగా, మిగతా పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి, ఆస్పత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు నిర్దేశిత గడువును తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాలలో తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>