కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఎకరా భూమి సరికొత్త రికార్డ్ ధర పలికింది. టీజీఐఐసీకి చెందిన రాయదుర్గం భూముల్లో (Raidurg Lands) వేలం వేయగా, ఎకరా రూ.269 కోట్లు అమ్ముడైంది. వంశీరాం బిల్డర్స్ 5.38 ఎకరాలను దక్కించుకుంది. ఇప్పటివరకు నగరంలో నిర్వహించిన వేలంలో ఎకరాకు వచ్చిన ధరల్లో ఇదే అత్యధికం. ఈ నెల 21న రాయదుర్గంలో నిర్వహించిన వేలంలో ఎకరా భూమి రూ.264 కోట్లు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే ఆల్ టైం రికార్డు నమోదు కావడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోష్ నింపుతోంది.
గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో భూములు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరీ ముఖ్యంగా రాయదుర్గం, కోకాపేట వంటి ప్రాంతాల్లో ఒక్కో ఎకరా భూమినే రూ.వందల కోట్లు పలుకుతుండటంతో దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వర్గాలను తెగ ఆకర్షిస్తోంది. తాజా వేలంతో సర్కార్ ఖజానాకు ఒకే సారి రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

