కలం, వెబ్ డెస్క్: తాడేపల్లిలోని వైసీపీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో ఆదివారం చంద్రబాబు మోసానికి రెండేళ్లు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజినీ (Rajini Vidadala) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా పది కేసులు పెట్టిందని, తన పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకుని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేసి మరీ ఈ సమావేశానికి వచ్చానని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే తాను ముందుకు సాగుతున్నానని, నిజాయితీగా ప్రజలకు మంచి చేశాం కాబట్టే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ మహిళా విభాగం కార్యకర్తలను, చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేసి వేధిస్తున్నారని రజిని విమర్శించారు. తనపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టడం రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనమని మండిపడ్డారు. పార్టీలో ఉన్న మహిళలందరూ ఫైటర్స్ అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా బాధితులకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేసి ఓడిపోయినా, జనాల్లో తమకు ఇంకా ఎంతో గౌరవం ఉందని, బెదిరింపులకు లొంగకుండా జగనన్న ఆశయాల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

