కలం, కరీంనగర్ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా గోదావరి నదిలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గోదావరి నదికి వేదపండితుల సమక్షంలో మహా హారతి ఇచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో సరస్వతి పుష్కరాలు గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే.. ఈసారి అంత్య పుష్కరాల్లో గవర్నర్, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో లక్షలాదిమంది సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానం ఆచరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్ లో మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షమైన వర్షాలతో సస్యశ్యామలంగా రైతులు పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి శుభం జరగాలని గోదావరి అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవలే కాశీ విశ్వేశ్వర క్షేత్ర పండితులు ఇక్కడ లోక కల్యాణం కోసం సమర్పించిన పవిత్రమైన హారతిని భక్తులు వీక్షించారని చెప్పారు. గురువుగారితో పాటు ఇక్కడి పండితులు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం కేవలం లోక కల్యాణార్థం, విశ్వ శాంతి కోసమేనని అన్నారు. కాశీ క్షేత్రంలోని విశ్వేశ్వరునికి, ఇక్కడి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధికి ఎంతో అద్భుతమైన పోలికలు ఉన్నాయని.. ఇదొక అత్యంత విశిష్టమైన క్షేత్రమని కొనియాడారు.

