Mobile Popup Ad
Mobile Popup Ad

మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మంది దుర్మరణం

కలం, వెబ్ డెస్క్: మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం జరిగిన భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 74 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన చైనా సరిహద్దుకు సమీపంలోని షాన్ రాష్ట్రం నామ్‌ఖామ్ ప్రాంతంలోని కౌంగ్‌టుప్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన భవనంలో గనులు, క్వారీల తవ్వకాల కోసం ఉపయోగించే జెలిగ్నైట్ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు సమాచారం.

పేలుడు తీవ్రతతో భారీ శబ్దం వినిపించడంతో పాటు దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. చుట్టుపక్కల ప్రాంతాలు ఒక్కసారిగా కంపించగా, గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. ఘటన సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

సాయంత్రానికి శిథిలాల కింద నుంచి 46 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 74 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

పేలుడు ధాటికి గ్రామంలోని 100కు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (టీఎన్‌ఎల్‌ఏ) ఆధీనంలో ఉంది. ఈ ఘటనపై స్పందించిన టీఎన్‌ఎల్‌ఏ, తమ ఆర్థిక విభాగం గనుల తవ్వకాల కోసం జెలిగ్నైట్ పేలుడు పదార్థాలను ఆ భవనంలో నిల్వ ఉంచినట్లు తెలిపింది.

సాధారణంగా రాళ్లను బద్దలు కొట్టేందుకు ఉపయోగించే జెలిగ్నైట్‌ను భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే పేలుడు ఎలా సంభవించిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>