కలం, వెబ్ డెస్క్: గోషామహల్‌లో 26 ఎకరాల్లో సుమారు రూ.3,000 కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని.. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో మరో మైలురాయి అవుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ (Rajanarasimha) అన్నారు. హైదరాబాద్ కోఠిలో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ వంటి కష్ట సమయంలో వారి సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ డాక్టర్లకు అవసరమైన సేవలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని, ఉస్మానియా హాస్పిటల్‌కు నూతన భవనాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా డాక్టర్లు అకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చామని వెల్లడించారు. గత రెండేళ్లలో ఆరోగ్య శాఖలో 10,327 నియామకాలు పూర్తి చేశామన్నారు. మరో 6,000 పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. నిన్ననే 174 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులో డాక్టర్లకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డాక్టర్ల డిమాండ్లు అన్నీ తాము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు.

