Mobile Popup Ad
Mobile Popup Ad

జనగామలో పసికందు కిడ్నాప్ కలకలం .. సినీ ఫక్కీలో ఛేజింగ్!

కలం, జనగామ బ్యూరో: జనగామ (Jangaon) జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో (MCH) బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలం రేగింది. అప్పుడే పుట్టిన పసిపాపను అపహరించేందుకు ఇద్దరు మహిళా కిడ్నాపర్లు చేసిన ప్రయత్నాన్ని చిన్నారి తండ్రి సాహసోపేతంగా అడ్డుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలక్పూర్ గ్రామానికి చెందిన కరుణాకర్, కీర్తన దంపతులకు ఈ నెల 2వ తేదీన మగబిడ్డ జన్మించాడు. శిశువుకు స్వల్పంగా పచ్చకామెర్లు (జాండీస్) ఉండటంతో ఆసుపత్రిలోని SNCU (Special Newborn Care Unit) విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఇది గమనించిన రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతి అనే మహిళ, తనను శిశువు తల్లిగా నమ్మబలికి వార్డులోకి ప్రవేశించింది. సిబ్బంది కళ్లుగప్పి పసికందును ఎత్తుకుని ఆటోలో పరారయ్యేందుకు ప్రయత్నించింది.

సినిమాను తలపించిన ఛేజింగ్:

తన బిడ్డ కనిపించకపోవడంతో అప్రమత్తమైన తండ్రి కరుణాకర్, వెంటనే ఆసుపత్రి సిబ్బంది సాయంతో కిడ్నాపర్ వెళ్తున్న ఆటోను వెంబడించారు. జనగామ శివారులోని షామీర్‌పేట వరకు సుమారు కిలోమీటర్ల మేర వెంబడించి కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. నిందితురాలిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేయగా, ఆమెతో ఉన్న మరో మహిళ పరారైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలోని సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తప్పించుకున్న రెండో మహిళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం:

అత్యంత రక్షణ ఉండాల్సిన SNCU వార్డులోకి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బిడ్డను తీసుకెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని బాధితులు, స్థానికులు మండిపడుతున్నారు. గతంలోనూ ఇక్కడ భద్రతా లోపాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>