కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanamkonda) జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వెంకటాపూర్ గ్రామ రైతులు, పేదలు ధర్నా నిర్వహించారు . ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో పేదల అసైన్డ్ భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని, వాటిని అధికారులు రద్దు చేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్న భూ కబ్జా దారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటాపూర్ లో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. హసన్ పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు ఉపయోగించి కేసులు నమోదు చేయాలని,భూకబ్జాదారుల కొమ్ము కాస్తూ వారికి సహకరించిన రెవెన్యూ అధికారుల సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించని ఎడల సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, జిల్లా నాయకులు ఏదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, మునిగాల బిక్షపతి, కర్రె లక్ష్మణ్, అలువాల రాజు, పద్మ, మాలోతు శంకర్, యాకూబ్ తదితరులు ఈ దర్నాలో పాల్గొన్నారు.

