కలం, వెబ్ డెస్క్ : భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar)కు వ్యతిరేకంగా ‘ఇండియా’ (INDIA) కూటమి ఎంపీలు ఢిల్లీ వేదికగా చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) మహిళా పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను బిజెపి నేతలు సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ విమర్శలు సంధించారు.
బిజెపి నేతలు పంచుకున్న వీడియో ఆధారంగా.. నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీస్ సిబ్బందిని అనుచితంగా తాకారని, తోసివేసేందుకు యత్నించారని, అలాగే ప్రియాంక గాంధీ సైతం ఒక మహిళా అధికారిపై మోచేతితో నెట్టివేశారని ఆరోపించారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే నాయకులు, విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల ఈ రకంగా ప్రవర్తించడం సరైనదేనా అని బిజెపి ప్రశ్నించింది.
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లకుండా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారని, రక్షణగా ఉన్న మహిళా పోలీసులే ప్రియాంక గాంధీని నేలపై పడేసి ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన సోదరిని కాపాడుకోవడానికి ప్రయత్నించారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Also Read : ప్రపంచ టెక్నాలజీకి భారత్ వేదిక కావాలి : ప్రధాని మోదీ
Follow Us On: Youtube

