హామీలు ఏవి? నిరుద్యోగ భృతి ఏది?: కాంగ్రెస్ వైఫల్యాలపై పువ్వాడ ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా… ఎన్నికల వేళ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం నిరసన జ్వాలలతో హోరెత్తింది. యువత, విద్యార్థి లోకం ఆధ్వర్యంలో ఖమ్మం పేవిలియన్ గ్రౌండ్స్ నుండి జడ్పీ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

​ఈ ర్యాలీలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని, జడ్పీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రేవంత్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో కదంతొక్కారు. ర్యాలీ అనంతరం జడ్పీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. గడిచిన మూడేళ్లుగా వేలాది కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లోనే పెట్టిందని, రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ల సమయంలో నెల రోజుల్లో చెల్లిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారాలు కూడా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​అలాగే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ ప్రకారం ప్రతి నెలా రూ. 4,000 చొప్పున మూడేళ్లకు గాను రూ. 1.20 లక్షల నుండి రూ. 1.30 లక్షల వరకు నిరుద్యోగ భృతిని ప్రభుత్వం బాకీ పడిందని గుర్తుచేశారు. 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతను పూర్తిగా మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రమేనని, మిగిలిన నియామకాలన్నీ కేసీఆర్ హయాంలో ప్రక్రియ పూర్తయినవేనని స్పష్టం చేశారు.

​యువత, విద్యార్థుల డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>