కలం, వెబ్డెస్క్: పార్లమెంట్ ఆవరణలో బుధవారం సరదా సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అటుగా వచ్చారు (Rahul Gandhi). ఆయన వెంట చెల్లెలు, ఎంపీ ప్రియాంక గాంధీతోపాటు మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఏదో విషయమై మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు.. రాహుల్ తన బృందంతో అక్కడికి రాగానే ఆపేశారు.అంతేకాదు, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వాళ్లను ఆగమంటూ రాహుల్ ఆపే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చేయి పట్టుకొని వెనక్కి లాగుతూ ‘అందరం కలిసే మీడియాతో మాట్లాడదాం’ అంటూ పిలిచారు. దానికి నిరాకరించిన జోషి ‘నువ్వే మాట్లాడుకో’ అని సైగ చేస్తూ, అశ్విని వైష్ణవ్ వెనకాలే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాహుల్ వెంట ఉన్న కాంగ్రెస్ ఎంపీల బృందం నవ్వులు చిందించింది (Rahul Gandhi). కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ అభిమానులు కామెంట్లతో పరస్పరం తలపడుతున్నారు.


