కలం/ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 36కు పైగా సిపిఐ అభ్యర్థుల విజయం ఖాయమని.. కార్పొరేషన్ పై కంకి, కొడవలి గుర్తుతో కూడిన ఎర్రజెండా ఎగురుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasiva Rao) అన్నారు. బుధవారం జరిగిన పోలింగ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు ఎంతో చైతన్యవంతంగా పాల్గొన్నారని, సిపిఐ ఎన్నికల గుర్తు కంకి-కొడవలికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే సిపిఐ అభ్యర్థుల మెజారిటీ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఎన్నికల సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఓటర్లను ప్రభావితం చేయాలని చూశారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasiva Rao) విమర్శించారు. అక్కడక్కడ పోలీసుల తీరు వల్ల చిన్నపాటి అసంతృప్తికర సంఘటనలు ఎదురైనప్పటికీ, ప్రజలు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. అధికార పక్ష ప్రలోభాలను కాదని, ప్రజా సమస్యలపై నిలబడే సిపిఐకే ఓటర్లు పట్టం కట్టారని ఆయన విశ్లేషించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా కృషి చేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుకి కూనంనేని అభినందనలు తెలిపారు. రెండు రోజుల్లో జరగబోయే ఓట్ల లెక్కింపులో ప్రజల తీర్పు స్పష్టంగా వెల్లడవుతుందని, కొత్తగూడెం అభివృద్ధిలో సిపిఐ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన స్పష్టం చేశారు.


