కలం, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ (Mahabubnagar) నగరంలోని గడియారం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) 56వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 56 అడుగుల భారీ బర్త్‌డే కేక్‌ను అనాథ విద్యార్థులతో కలిసి కట్ చేసి వారికి తినిపించారు. అలాగే విద్యార్థులకు కొత్త బట్టలను పంపిణీ చేశారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తుకు మార్గదర్శిగా, యువతకు ఆశాకిరణంగా రాహుల్ గాంధీ నిలిచారని అన్నారు. దేశంలో గత కొన్నేళ్లుగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక పరిస్థితి బలహీనపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో దేశానికి సరైన దిశ చూపగల నాయకుడిగా రాహుల్ గాంధీ ఎదిగారని పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం రాజకీయాలు చేసే అరుదైన నాయకుడని కొనియాడారు. దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన చేసిన పాదయాత్రలు, ముఖ్యంగా భారత్ జోడో యాత్ర దేశ ఐక్యతకు నిదర్శనమని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు. యువతలో ఆయనపై విశ్వాసం పెరుగుతోందని, భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోట్లాది మంది ఆశిస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, “గడప గడపకు కాంగ్రెస్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించేందుకు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ (Mahabubnagar Congress) పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సహా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
Read Also: అటవీ అడ్డంకులు.. అంధకారంలో ఆదివాసీ గూడెం!
Follow Us On: Instagram

