కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 2021లో ఇచ్చిన ఓఎం (ఆఫీస్ మెమొరాండం) చెల్లుబాటు కాదని, 1986 నాటి పర్యావరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధమైనదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు (Supreme Court) దాన్ని కొట్టివేసింది. కేంద్రం ఇచ్చిన ఆ ఓఎం కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరేనని, చట్టానికి లోబడి ఇచ్చిన నోటిఫికేషన్ కాదని స్పష్టం చేసింది. ఇకపైన ఆ ఓఎం నిబంధనల మేరకు ఇరిగేషన్ లేదా ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ దాఖలయ్యే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఆ ఓఎం ప్రకారం మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటు అవుతాయని, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకే తాజా ఉత్తర్వులు వర్తస్తాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్జి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి లాంటి పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉపశమనం లభించినట్లయింది.
చట్టం స్ఫూర్తికి విరుద్ధమైనందునే కొట్టివేస్తున్నాం :
ప్రభుత్వమైనా ప్రైవేటు సంస్థలైనా ప్రాజెక్టులను చేపట్టడానికి ముందే పర్యావరణ అనుమతులు (Environmental Clearance) తప్పనిసరిగా పొందాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని, ఆ తర్వాత పర్మిషన్లు తీసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 2021 ఉత్తర్వులు (OM) దానికి మేలు చేసేలా ఉన్నదని, ఇది పర్యావరణ చట్టం స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.
చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో అనుమతులు ఇవ్వడం ఉల్లంఘనే అవుతుందని, అలాంటి ఆర్డర్‌లతో చట్టాలను భర్తీ చేయడం వీలుపడదని, అవసరమైతే నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏదేని అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు మినహాయింపులు ఇవ్వాలనుకుంటే కేంద్రం చట్టబద్ధమైన నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని సూచించింది. ఈ కారణాలతోనే 2021 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (OM)ను రద్దు చేయాల్సి వస్తున్నదని స్పష్టం చేసింది. దీనికి ముందు 2017 ఆర్డర్ జారీ అయినా అది చట్టంలోని నిబంధనల మేరకు నోటిఫికేషన్ ప్రాక్టీస్‌ను అనుసరించిందని వివరణ ఇచ్చింది.
పోస్ట్ ఫ్యాక్టో పర్మిషన్లపై కీలక ఆదేశాలు :
ఎలాంటి ముందస్తు పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణమయ్యే ప్రాజెక్టులకు పోస్ట్ ఫ్యాక్టో పద్ధతిలో అనుమతులు ఇచ్చేందుకు వీలుగా 2021 ఉత్తర్వుల మార్గాన్ని కేంద్రం ఎంచుకున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి విధానాన్ని ఎంచుకునే అధికారం ఉన్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో కాకుండా పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్-3 ప్రకారం నోటిఫికేషన్ రూపంలో మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. పరిపాలనా ఉత్తర్వుల ద్వారా చట్టంలోని నిబంధనలను సవరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది.
గతంలో ‘కామన్ కాజ్’, ‘అలెంబిక్ ఫార్మా’ కంపెనీల కేసుల్లో పోస్ట్-ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల జారీ పర్యావరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధమని చేసిన వ్యాఖ్యలను బెంచ్ గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు 2017 నోటిఫికేషన్ లేదా 2021 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద మంజూరు చేసిన పర్యావరణ అనుమతులు చెల్లుబాటవుతాయని, కానీ నిర్దిష్టంగా ఏదేని అనుమతిపై ప్రత్యేకంగా కోర్టులో సవాలు చేస్తే వాటిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నది.

