కలం, వెబ్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు స్పిన్నర్ రాధా యాదవ్ రాబోయే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీని గెలవడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే మించిన అనుభూతి మరొకటి లేదని ఆమె స్పష్టం చేశారు. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరమైన రాధా.. మళ్లీ జాతీయ జట్టులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఈ అవకాశానికి మొదట దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నట్లు తెలిపారు. భారత్‌కు ఆడటం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. కెరీర్‌లో ఐదోసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న రాధా.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
డొమెస్టిక్ క్రికెట్, ఇండియా-ఎ మ్యాచ్‌లు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో ఆర్సీబీ తరఫున రాణించడం వల్లే ఆమెకు మళ్లీ జట్టులో చోటు దక్కింది. జట్టు సభ్యులందరూ తనపై నమ్మకం ఉంచడం చాలా ప్రత్యేకం అని రాధా చెప్పారు. జట్టుకు దూరమైన సమయంలో ఒత్తిడిని, ఆత్మవిశ్వాస లోపాన్ని అధిగమించడం పెద్ద పాఠమని ఆమె వివరించారు. మైదానంలో కష్టపడటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నట్లు చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో తన స్నేహితులు, కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఈ మెగా టోర్నీలో ప్రతి చిన్న సహకారం కూడా జట్టు విజయానికి ఎంతో కీలకమని రాధా యాదవ్ అభిప్రాయపడ్డారు. అది ఒక ఓవర్ అయినా, క్యాచ్ అయినా, లేదా ఫీల్డింగ్‌లో పరుగులు కాపాడటమైనా మ్యాచ్ ఫలితాన్ని మారుస్తుందని చెప్పారు. ఆటగాళ్లంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగితే ట్రోఫీని ముద్దాడటం సులువవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్ ఒక్కసారి కూడా మహిళల టీ20 ప్రపంచకప్ గెలవలేదు.

