కలం, వనపర్తి: జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాతే 2026-27 ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ (Rachala Yugander Goud) కోరారు. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ.. కొందరు మిల్లర్లు చేస్తున్న అక్రమాలకు సివిల్ సప్లయ్స్ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సివిల్ సప్లయ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ, విజిలెన్స్ తనిఖీల్లో వేలాది ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడైందని పేర్కొన్నారు.
ధాన్యం కేటాయింపులకు ముందు అన్ని మిల్లుల్లో మరోసారి భౌతిక తనిఖీలు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో పాటు వారికి సహకరించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన మిల్లర్లకు న్యాయం జరగడంతో పాటు ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.

