కలం, నిర్మల్ : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేష్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్‌తో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల పురోగతిపై ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను జనవరి మొదటి వారంలోగా గరిష్ట స్థాయిలో వినియోగించాలని సీఎస్ సూచించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులు చేపట్టాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులకు యూనిఫారాలు, కిట్లు అందేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
వేసవి కాలం ముగిసే వరకు ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిలో తాగునీటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి వారం నీటి సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. నవంబర్ 15లోగా చేతిపంపులు, బోర్లు, బహిరంగ బావులకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలని, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులైన్లలో లీకేజీలు, ప్రెజర్ వాల్వ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని, అక్రమ కనెక్షన్లు, నీటి వృథాను అరికట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి బోజన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

