కలం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Crimes) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు,చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు సైబర్ నేరాల బాధితులే. కొందరు రాజకీయనాయకులు సైతం ఈ వలలో చిక్కారు. అయితే, విచిత్రంగా ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు తగ్గాయంటోంది పోలీసుల నివేదిక.సోమవారం రాచకొండ కమిషనర్ జి.సుధీర్ బాబు విడుదల చేసిన ‘రాచకొండ క్రైమ్ రిపోర్ట్-2025’ రిపోర్టులో సైబర్ క్రైమ్ వివరాలు ఉన్నాయి.ఈ రిపోర్టు ప్రకారం 2025లో మొత్తం 3,734 నేరాలు జరిగాయి. గత ఏడాది 4,618 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది దాదాపు వెయ్యి నేరాలు తక్కువ జరిగాయి.
కాగా, ఈ సంవత్సరం నమోదైన సైబర్ కేసుల్లో (Cyber Crimes) పెట్టుబడి పేరుతో జరిగిన మోసాలు అత్యధికం. ఇవి 1,512 నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో పార్ట్‌టైమ్ జాబ్‌కు సంబంధించినవి 1,215 ఉన్నాయి. అలాగే అనధికార లావాదేవీలవి 216, ఏపీకే ఫైల్స్‌వి 96, జాబ్ పేరుతో జరిగినవి 137, నకిలీ కస్టమర్ కేర్‌వి 122, లోన్‌వి 125, బిజినెస్‌వి 31, డిజిటల్ అరెస్ట్‌వి 43 కేసులు నమోదయ్యాయి. అలాగే సీసీ / ఓఎల్‌ఎక్స్/గిఫ్ట్/మ్యాట్రిమోనీ, ఇతర సైబర్ మోసపు కేసులపై 237 ఫిర్యాదులు నమోదైనట్లు నివేదిక చెబుతోంది. కేసులన్నింటిలో బాధితులకు నిందితులు, వాళ్ల అకౌంట్ల నుంచి పోలీసులు రికవరీ చేయించిన సొమ్ము రూ.40.10కోట్లు. వీటికి సంబంధించి 41 మందిపై పీటీ వారెంట్లు ఇష్యూ చేశారు. 92 మందిని అరెస్టు చేశారు. అలాగే కమిషనరేట్ పరిధిలో మొత్తం 955 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి దాదాపు 1.02లక్షల మంది హాజరైనట్లు రాచకొండ క్రైమ్ రిపోర్ట్ చెబుతోంది.


