కలం, స్పోర్ట్స్ : చైనా ఓపెన్ 2026 నుంచి భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు (PV Sindhu) నిష్క్రమించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన చెన్ యుఫీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే టోర్నమెంట్ షెడ్యూలింగ్ తీరుపై సింధు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఓటమితో పాటు లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి కూడా నిష్క్రమించడంతో చైనా ఓపెన్‌లో భారత్ సవాళ్లు ముగిశాయి. ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న సింధు, ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చారు.
మొదటి గేమ్‌ను 21-16తో గెలుచుకున్న ఆమె, రెండో గేమ్‌లో 20-16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. చెన్ యుఫీ పుంజుకుని 22-20తో రెండో గేమ్‌ను, చివరి గేమ్‌ను 21-18తో గెలుచుకున్నారు. గంటా 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు ఓటమిని చవిచూశారు. ఇదిలా ఉండగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కెనడాకు చెందిన విక్టర్ లై చేతిలో 19-21, 11-21 తేడాతో ఓడిపోయారు. ఆయుష్ శెట్టి ఐర్లాండ్‌కు చెందిన నాట్ న్గుయెన్ చేతిలో 21-15, 13-21, 20-22తో హోరాహోరీ పోరులో పరాజయం పాలయ్యారు.
మ్యాచ్ అనంతరం సింధు సోషల్ మీడియా వేదికగా షెడ్యూలింగ్‌పై స్పందించారు. తనకు మ్యాచ్ మ్యాచ్ మధ్య కేవలం 16 గంటల రికవరీ సమయం మాత్రమే లభించిందని తెలిపారు. అదే సమయంలో తన ప్రత్యర్థి చెన్ యుఫీకి పూర్తి రోజు విశ్రాంతితో పాటు 24 గంటలకు పైగా సమయం దక్కిందని పేర్కొన్నారు. ఆటగాళ్ల రికవరీకి ప్రాధాన్యం ఇవ్వడం మంచిదేనని, అయితే ఆ నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

