కలం, ఖమ్మం బ్యూరో: ప్రపంచ వాతావరణ నిపుణులు ఎల్‌నినో ప్రభావంపై గత తొమ్మిది నెలలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. అన్నదాతలు తీవ్ర అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొంటున్న కరువు పరిస్థితులు, సాగునీరు, విద్యుత్ కొరతపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, రైతులకు సాగునీరు, విద్యుత్ అందించలేకపోతున్నారని పువ్వాడ విమర్శించారు. రైతులకు అవసరమైన కనీస వసతులు కూడా కల్పించలేని దుస్థితి నెలకొనడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అత్యవసర చర్యలు తీసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సాగునీరు, విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు తక్షణ ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని పువ్వాడ హెచ్చరించారు.

