కలం, నిర్మల్ : జల్సాలకు అలవాటు పడి, ఆన్లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్‌ల రుణాల భారం తట్టుకోలేక స్వంత ఇంట్లోనే దొంగతనానికి (Theft) పాల్పడిన నిందితుడిని నిర్మల్ పట్టణ పోలీసులు (Nirmal Police) మంగళవారం అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గాజులపేట్‌కు చెందిన మహమ్మద్ ఔసఫ్ అహ్మద్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చే ఆదాయం తన ఖర్చులకు సరిపోకపోవడంతో ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి డబ్బులు కోల్పోయాడు.
దీనికి తోడు లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. రుణాలు తిరిగి చెల్లించాలంటూ ఏజెంట్ల నుంచి ఒత్తిడి పెరగడంతో దొంగతనానికి పథకం వేశాడు. ఈ క్రమంలో సోమవారం కుటుంబ సభ్యులంతా ఓ శుభకార్యానికి వెళ్లిన సమయంలో రాత్రి తన ఇంట్లోనే బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. సాంకేతిక నైపుణ్యాలతో 24 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసులు జీవించిన పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్సై అజయ్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

