కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన పూర్తిగా శూన్యంగా మారిందని, రాబోయే రోజుల్లో ఈ అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ‘కర్రు కాల్చి వాత పెట్టడం’ ఖాయమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఖమ్మం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసానికి నిలువెత్తు రూపమని దుయ్యబట్టిన ఆయన, కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు మోసపోవడం ఖాయమనే విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైందన్నారు.
కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని పువ్వాడ గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తూ, రుణమాఫీని సరిగ్గా చేయక రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టిందని వాపోయారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు నిలువునా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నాణ్యమైన విద్యనందించే గురుకులాల్లో సైతం విద్యార్థులు అనేక వసతుల లేమితో అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేశారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు వారిని కూడా మోసం చేశారని, మొత్తం పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావడం, తెలంగాణ రామరాజ్యం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, భూదోపిడీలకు పాల్పడుతున్నారని పువ్వాడ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.9,000 కోట్లు ఖర్చు చేసి సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తే, ఈ ప్రభుత్వం కనీసం రూ.90 కోట్లు కూడా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులను నిండా ముంచుతోందని నిప్పులు చెరిగారు. ఇక ఖమ్మం జిల్లా పరిస్థితులపై మాట్లాడుతూ.. గతంలో తాను ఒక్క మంత్రిగా చేసిన అభివృద్ధి పనిని, నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. చివరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు మంజూరు చేసిన 23 ఎకరాల స్థలాన్ని కూడా వర్కింగ్ జర్నలిస్టులకు కేటాయించలేని అసమర్థతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

