కలం, దమ్మపేట: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు మూగజీవాలను మృత్యు అంచుల్లోకి నెడుతూ సాగుతున్న భారీ అక్రమ గో రవాణా (Illegal Cow Transport) గుట్టు రట్టయింది. కంటైనర్ లారీలో దారుణమైన రీతిలో కుక్కి తరలిస్తున్న 100కు పైగా గోవులను భాగ్యనగర్ గో రక్షక్ టీమ్ సభ్యులు సినీ ఫక్కీలో వెంబడించి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట (Dammapeta) వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు.
ఒడిశా రాష్ట్రం నుంచి కొవ్వూరు మీదుగా హైదరాబాద్‌కు కంటైనర్ లారీలో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గో రక్షక్ టీమ్‌కు నిఘా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన సభ్యులు కొవ్వూరు వైపు నుంచి వస్తున్న సదరు అనుమానాస్పద కంటైనర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా పోనివ్వడంతో, గో రక్షక్ సభ్యులు తమ వాహనాల్లో సినీ ఫక్కీలో కిలోమీటర్ల మేర వెంబడించి దమ్మపేట మండల శివారులో లారీని అడ్డుకున్నారు.
వాహనాన్ని తనిఖీ చేయగా కంటైనర్ లోపల దృశ్యం గో రక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కనీసం గాలి కూడా ఆడేందుకు వీలు లేని విధంగా, దారుణమైన రీతిలో 100కు పైగా గోవులను ఒకదానిపై ఒకటి కుక్కి తరలిస్తున్నారు. సరైన గాలి, నీరు లేక మృత్యు అంచున కొట్టుమిట్టాడుతున్న ఆ మూగజీవాలను చూసి స్థానికులు కలచివేతకు గురయ్యారు.
వెంటనే గో రక్షక్ బృందం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, దమ్మపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన గోవులకు ప్రాథమిక చికిత్స అందించి, వాటి సంరక్షణ కోసం సురక్షితమైన గోశాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ జరుపుతున్నారు.

