దుబ్బాకలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ నిరసనలు

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజకవర్గ కేంద్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా నిరసనకు దిగడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నెరవేర్చని హామీలతో కూడిన “బాకీ కార్డులను” పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ఎగవేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.

బీఆర్ఎస్ చేపట్టిన ఈ ధర్నాపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతూ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ నిరసన కార్యక్రమానికి దిగాయి. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో దుబ్బాక బస్టాండ్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>