కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టు రైతుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, ప్రభుత్వం వెంటనే సాగునీటిపై క్లారిటీ ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో నీటి లభ్యతపై పత్తాలేని ప్లానింగ్‌తో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నీటి వినియోగం, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్లే రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారన్నారు. ముందస్తు నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటిస్తేనే రైతులు పంటల ఎంపిక, సాగు సమయాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకోగలుగుతారని స్పష్టం చేశారు.
నాగార్జున సాగర్, గోదావరి, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని వంటి ప్రధాన జలవనరులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? ఏయే ప్రాంతాలకు ఎంత మేర నీరు అందుబాటులో ఉంటుంది? అనేది ప్రభుత్వం వెంటనే సమీక్షించి శ్వేతపత్రం, అధికారిక ప్రకటన విడుదల చేయాలని కోరారు. వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా నీటి యాజమాన్య ప్రణాళికను రూపొందించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్కొన్నారు.

