కలం, కరీంనగర్: ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గాలిమోటార్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని బీఆర్ఎస్ నాయకులు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) ఎద్దేవా చేశారు. గత 23 రోజులుగా పెద్దపల్లిజిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు (NHM Employees Protest) ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మధూకర్ మాట్లాడుతూ.. మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 90 సార్లు ఢిల్లీకి వెళ్లాడని, ముఖ్యమంత్రి ఢిల్లీకి పదేపదే ఎందుకు వెళ్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. నిత్యం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మంది మహిళలే ఉన్నారని, అయినప్పటికీ కనీసం ప్రసూతి సెలవులు కూడా కల్పించకపోవడం అనాగరికమని మధూకర్ విమర్శించారు. మహిళా ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్, ఈఎస్‌ఐ వంటి వైద్య సదుపాయాలు, ఎక్స్‌గ్రేషియా, బీమా పథకాలు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే న్యాయపరమైన సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం, ఆ తర్వాత పిల్లలు అంగన్‌వాడీ వయసుకు వచ్చే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందించే ఇలాంటి ఉద్యోగులు 23 రోజులుగా విధులకు దూరంగా ఉంటే గ్రామాల్లో పేదలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.
అధికారంలోకి రాకముందు ఉద్యోగుల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టేస్తామని.. రైతుల రుణమాఫీ, ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈనాడు వాళ్ల కడుపు కోసం, కుటుంబాల కోసం పనిచేస్తున్నడన్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారంపై మాత్రం దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.
ఢిల్లీ పర్యటనలు, హెలికాప్టర్ ప్రయాణాల కోసం ప్రజాధనం ఖర్చు చేసే బదులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వేతనాలు పెంచాలని, ప్రసూతి సెలవులు, వైద్య బీమా, ఈఎస్‌ఐ, ఈహెచ్‌ఎస్ తదితర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంపూర్ణ మద్దతు కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

