కలం, కరీంనగర్: ఆర్డర్ ఇచ్చి నీళ్లు ఇప్పించాల్సిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరో మంత్రి దగ్గరకు పోయి ఫోటోలు దిగుతున్నాడంటే.. నీళ్లు, కరెంటు ఇచ్చేందుకు కాలయాపన చేస్తూ మరోసారి మోసం చేసేందుకేనని అర్థం అవుతుందని మంథని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు, ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్న క్రమంలో రైతులతో కలిసి శుక్రవారం మంథని పాత పెట్రోల్ బంక్ సమీపంలోని మంథని కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
సుమారు గంట పాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల నినాదాలు మార్మోగాయి. అనంతరం మధూకర్ (Putta Madhukar) మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పంటల సాగుకు పెట్టుబడులు పెట్టామని, వరిపంట పొట్టదశకు వచ్చిన క్రమంలో కరెంటు లేక నీళ్లు పారక పంటలు ఎండిపోవడంతో ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేయడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
కరెంటు లేక బోర్లు పని చేయక కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయని మధూకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 420హమీలు రాసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ 24గంటల కరెంటు ఇస్తామని హమీ ఇచ్చారని.. కానీ ఈనాడు ఆ హమీ నెరవేర్చకపోగా రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే, ఆయన కుటుంబం స్థానికంగా ఉండరని అన్నారు. రైతుల కన్నీరు, ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని.. కానీ వాళ్లలా తాము చూసిచూడనట్లుగా ఉండలేమని అన్నారు.
ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం..
ప్రజల పక్షనా పోరాటం చేస్తే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్భందం విధించినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మధూకర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హమీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈనాడు పంటలు కాపాడకపోతే కళ్ల ముందే రైతులు ప్రాణాలు పోయేలా ఉన్నాయని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతుల కోరిన వెంటనే బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఎర్రటి ఎండలో రైతుల కోసం నిలబడ్డారని అన్నారు. కరెంటు నీళ్లు ఇవ్వమంటే ఏవో సాకులు చెప్పవద్దని, ఎల్‌నినో ప్రభావం ఉంటుందని రెండేళ్ల ముందే వాతావరణశాఖ హెచ్చరించిందని గుర్తు చేశారు. కరెంటుకు డిమాండ్ ఉంటుందని తెలిసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్త నుంచి రాహుల్ గాంధీ వరకు దోపిడి మీద ఉన్న ద్వాస ప్రజల మీద లేదని స్పష్టం అవుతుందని మధూకర్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ కళ్లు తెరిచి వ్యవసాయానికి సరపడా కరెంటు ఇవ్వాలని, ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తీర్చకపోతే సబ్‌స్టేషన్‌లను ముట్టడిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇది ప్రజలు, రైతుల ఆందోళన, ఆవేదన అని గమనించి వెంటనే కరెంటు, నీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

