కలం, వెబ్ డెస్క్: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై వస్తున్న ఆరోపణలతో అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. వెంటనే హై లెవలె కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. గిరిజన ప్రాంత ఎమ్మెల్యేగా అడవి బిడ్డలకు పారదర్శకమైన సేవలు అందించాలని గతంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి స్వయంగా పిలిపించి హెచ్చరించారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
నీతివంతమైన పాలన అందించాలని సూచించినా బాలరాజులో మార్పు రాకపోవడంపై పవన్ కళ్యాణ్ చిరాకు, విసుగు చెందారని పార్టీ పేర్కొంది. కూటమి ప్రభుత్వం అడవి తల్లి బాట పేరిట వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే బాలరాజు వ్యవహారశైలిపై పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందారని వివరించింది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

