పంజాబ్ దెబ్బకు చెన్నై చిత్తు.. అదరగొట్టిన అయ్యర్ టీమ్

కలం, వెబ్ డెస్క్:  ‘నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికి వస్తా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని బాలయ్య అన్నట్లు చెన్నైని వాళ్ల హోంగ్రౌండ్‌లోనే చిత్తు చేసింది పంజాబ్ కింగ్స్. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రేయస్ అయ్యర్ సేన అదరగొట్టింది. చెన్నై విసిరిన 210 పరుగుల భారీ లక్ష్యం చూసి.. ‘ఇక పంజాబ్ పని అయిపోయింది’ అనుకున్న వారందరికీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పారు అయ్యర్ అండ్ కో. చెన్నై బౌలర్లను వాళ్ల సొంత గడ్డపైనే ఒక ఆట ఆడుకుంటూ, ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని తమ ఖాతాలో వేసుకుని చెన్నై ఫ్యాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను వణికించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28), చివర్లో శివం దూబే (45 నాటౌట్) తమ ఫామ్‌ను కొనసాగించగా, సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లో 32 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో సీఎస్‌కే 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, మిగతా వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

210 పరుగుల టార్గెట్ అంటే హిమాలయ పర్వతం ఎక్కినంత కష్టమని భావించిన ఫ్యాన్స్‌కు పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య చుక్కలు చూపించాడు. కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి ‘సునామీ’ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. అతని స్ట్రైక్ రేట్ (354.54) చూస్తుంటే స్టేడియం మొత్తం షేక్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43), కూపర్ కానలీ (36) ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, అసలైన షోను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నడిపించాడు. 29 బంతుల్లో 50 పరుగులు చేసి టీమ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు తీసినా పంజాబ్ జోరును అడ్డుకోలేకపోయారు. చివర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ కలిసి ఫినిషింగ్ టచ్ ఇచ్చి, 18.4 ఓవర్లలోనే 210 పరుగులు చేసి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>