కలం, వెబ్ డెస్క్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లూ భారీగా పెరిగాయి. గత ఏడాది (2024-25) రూ.617.38 కోట్లుగా ఉన్న వసూళ్లు, ఈ ఏడాది రూ.685.04 కోట్లకు పెరిగింది. అలాగే మొత్తం డిమాండ్ కూడా రూ.1011 కోట్ల నుంచి రూ.1179 కోట్లకు పెరగడం గమనార్హం.
పలు కార్పొరేషన్లలో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో రూ.74.91 కోట్ల నుంచి రూ.91.23 కోట్లకు, కరీంనగర్‌లో రూ.37.63 కోట్ల నుంచి రూ.48.15 కోట్లకు, ఖమ్మంలో రూ.34.45 కోట్ల నుంచి రూ.36.76 కోట్లకు పెరుగుదల నమోదైంది. మంచిర్యాలలో రూ.17.01 కోట్ల నుంచి రూ.19.44 కోట్లకు, రామగుండంలో రూ.10.71 కోట్ల నుంచి రూ.14.48 కోట్లకు, నిజామాబాద్‌లో రూ.40.24 కోట్ల నుంచి రూ.43.73 కోట్లకు వసూళ్లు పెరిగాయి.
కొన్ని కార్పొరేషన్లలో వసూళ్లు తగ్గాయి. కొత్తగూడెంలో రూ.9.99 కోట్ల నుంచి రూ.8.66 కోట్లకు, మహబూబ్‌నగర్‌లో రూ.22.96 కోట్ల నుంచి రూ.22.32 కోట్లకు తగ్గుదల కనిపించింది. నల్లగొండలో కూడా స్వల్పంగా వసూళ్లు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 64 అర్బన్ లోకల్ బాడీల్లో గత ఏడాదితో పోలిస్తే వసూళ్లు పెరగడం విశేషం. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ఈ ఏడాదీ కూడా 100 శాతం వసూళ్లు సాధించి ప్రత్యేకంగా నిలిచాయి. 2024-25లో 80 శాతం కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన ULBలు 42 ఉండగా, 2025-26లో ఆ సంఖ్య 24కి తగ్గింది. కొత్తగా ఏర్పడిన 21 ULBల్లో 16 చోట్ల వసూళ్లు పెరిగాయి. సమర్థంగా వసూళ్లూ పూర్తయ్యేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్ సహకారంతో 650 హ్యాండ్‌హెల్డ్ పరికరాలను ULBలకు అందజేశారు. దీంతో భవిష్యత్తులో ట్యాక్స్ వసూళ్లు వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

