కలం, వెబ్ డెస్క్: తిరుపతి దర్శనం చేపిస్తానని చెప్పి ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఓ పూజారి పంగనామం పెట్టాడు. దర్శనం పేరుతో రోజు ఫోన్ తీసుకొని లక్షలాది రూపాయలు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన రిటైర్డ్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గంగాధర మండలం ఓద్యారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఓ రిటైర్డ్ ఉద్యోగి ప్రతి రోజు దర్శనానికి వెళ్తున్నాడు. ఆలయ పూజారి సాయి తరుణ్ అతడితో పరిచయం పెంచుకున్నాడు.
తిరుపతి దర్శనం, ట్రైన్ టిక్కెట్లు బుక్ చేస్తానని బాధితుడి ఫోన్ తీసుకొని ఫోన్ పే, గూగుల్ పే పాస్‌వర్డ్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్‌కు మేసేజ్‌లు రాకుండా చేసిన సాయి తరుణ్ టీటీడీ టికెట్ల పేరుతో ప్రతిరోజూ ఫోన్ తీసుకొని బాధితుడి ఖాతా నుండి 30 విడతల్లో రూ.18.46 లక్షల రూపాయలను దామెర హరీష్ అనే వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇటీవల డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లిన బాధితుడు అధికారులు చెప్పిన మాటలకు షాకయ్యాడు. తన అకౌంట్‌లో అసలు డబ్బులు లేవని అధికారులు చెప్పారు. దీంతో బాధితుడు బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసి చూడగా రోజు ఉదయం 9 గంటలలోపు రూ.99,999 వేరే ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు హరీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని, పరారీలో ఉన్న పూజారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు ఎవరూ బయటి వ్యక్తులకు తమ బ్యాంక్ అకౌంట్, యూపీఐ వివరాలు చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: నెట్‌ఫ్లిక్స్‌కు సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Facebook

