కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రాకతో తన కల సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనకు సినిమాల మీద ఎంతో ఆసక్తి ఉందని చెప్పారు. బాల్యం నుంచి సినీ రంగంలో అనేక మార్పులు రావడం తాను గమనించానన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, అరుంధతి వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరమీదకు వచ్చాయన్నారు. గతంలో చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తాము హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయి సినిమాలు తీసే కేంద్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్టే
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ పరిశ్రమ వచ్చినట్టేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ దృష్టి హాలివుడ్‌పైనే ఉందని గతంలో తాను చెప్పానని గుర్తు చేశారు. ‘నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని చెప్పారు. ‘ఫోర్త్‌సిటీని నిర్మిస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నా. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది. తెలంగాణ అంటేనే వ్యాపారం.’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

