Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణపై చంద్రబాబు కన్ను: వేముల ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో:  తెలంగాణ రాష్ట్రంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కన్ను పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashant Reddy) ఆరోపించారు.  రేవంత్ రెడ్డిని ముందుపెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయం చేయాలని భావిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మాటతప్పిన రేవంత్ రెడ్డి

రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పినందుకు ఇప్పుడు అదే దేవుళ్ళ దగ్గరికి వెళ్లి ఆయా గుడులకు నిధులు ఇస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పు కేవలం రూ.4 లక్షల కోట్లు మాత్రేమనని.. ఆ అప్పుతో కాళేశ్వరం లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, 75 వేల కోట్ల రైతుబంధు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాగే రూ. 200 పెన్షన్‌‌ను రూ. 2,000కు పెంచారని.. కల్యాణలక్ష్మి కింద కింద రూ. 1,00,116 అందించారన్నారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, చేనేత, బీడీ కార్మికులకు చేయూత, మైనారిటీల, బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ అప్పుచేసి తెలంగాణలో సంపదను, ఆస్తులను సృష్టించారని పేర్కొన్నారు.

అప్పులు చేసి కాంగ్రెస్ ఏం చేసింది?

కేసీఆర్ అప్పులు చేశారని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో స్వల్ప కాలంలోనే ఏకంగా రూ. 4 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. మరి ఈ రూ. 4 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మహిళలకు తులం బంగారం ఇస్తామని మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఇస్తామని, రూ. 2,00,000 రుణమాఫీ చేస్తామని, రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని, పెన్షన్లను రూ. 4,000కు పెంచుతామని నమ్మబలికిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఓట్లు తొలగించే కుట్ర

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తప్పుడు పద్ధతుల ద్వారా బీఆర్ఎస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మన ఓట్లను కాపాడుకోవడంతో పాటు, కొత్త ఓట్లు చేర్పించడం, ఎక్కడా డూప్లికేట్ (దొంగ) ఓట్లు నమోదు కాకుండా మన బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

సభ్యత్వ నమోదు విజయవంతం చేద్దాం

ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని గ్రామాలు, వార్డులు, బస్తీల స్థాయిలో విస్తృతంగా సభ్యత్వాలు నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు జిల్లా ఇంచార్జ్ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, జజాలా సురేందర్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ దావ వసంత, రాజారామ్ యాదవ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, బూత్ స్థాయి ఏజెంట్లు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>