కలం, కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం మరమ్మతులు చేయలేని అసమర్థ ప్రభుత్వమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు కూడా చేపట్టలేని అసమర్థ ప్రభుత్వమని ఆరోపించారు.
మహారాష్ట్ర సీఎంతో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ కూడా పొందలేని సీఎం రేవంత్ రెడ్డి అని, మధ్యవర్తిత్వం కోరే స్థాయికి దిగజారారని విమర్శించారు. కేసీఆర్ పై ఆరోపణలు చేయడం తప్ప ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద పూర్తి చేసి నదీ జలాలను వినియోగంలోకి తెచ్చే వరకు రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణను ఎండబెట్టి పోలవరం ప్రాజెక్టుకు, చంద్రబాబుకు వంతపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్,కేసీఆర్ తోనే ముడిపడి ఉందని.. కేసీఆర్ నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని జీవన్ రెడ్డి అన్నారు. తాగు, సాగునీటి అవసరాలు గుర్తించి ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరువు వస్తే అది ప్రకృతి వల్ల కాదని, రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లేనని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ , బీఆర్ఎస్ అవసరాన్ని గుర్తిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, చలిగల్ సర్పంచులు జున్ను రాజేందర్, శీలం సురేందర్, నాయకులు శీలం ప్రవీణ్, అయిల్నేని వెంకటేశ్వర్ రావు, నేహాల్,మున్నా,దుర్గయ్య, గాజుల రాజేందర్, మాజీ ఎంపిపి ధర రమేష్ బాబు, చందా రాధాకిషన్ తదితరులున్నారు.

