కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హిందూ సమాజం అత్యంత పవిత్రంగా ఆరాధించే రామలక్ష్మణులను వలస కూలీలతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామాయణ గాథపై భిన్నమైన విశ్లేషణ చేస్తూ, రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుండి వచ్చిన వలస కూలీలని ఆయన అభివర్ణించారు. వారు దక్షిణాదికి వచ్చి ఒక పొలంలో ప్రవేశించి, అక్కడ ఉన్న పండ్లను దొంగిలించి తిన్నారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా, ఆ పొలం యజమాని గిరిజనుడైన రావణుడని, తన పొలంలో పండ్ల దొంగతనాన్ని ప్రశ్నించినందుకే రాముడికి, రావణుడికి మధ్య వివాదం మొదలై అది పెద్దదైందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శూర్పణఖ ప్రస్తావన తెస్తూ, జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు చెల్లించాలని ఆమె కోరినట్లుగా ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కోట్ల మంది ఆరాధ్య దైవాలను అవమానించేలా మాట్లాడటం సరికాదని, కావాలనే మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ పలుమార్లు హిందూ ధర్మంపై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, తాజా సంఘటనపై పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవిత్ర రామాయణాన్ని అపహాస్యం చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

