లోక్‌సభలో 3 బిల్లులపై చర్చ.. మహిళా బిల్లుపై నేడే ఓటింగ్

కలం, వెబ్ డెస్క్: లోక్ సభలో శుక్రవారం చారిత్రక ఘట్టంగా ఆవిష్కృతం కానుంది. లోక్‌సభ (Lok Sabha)లో మూడు ప్రధానమైన బిల్లులైన రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill), నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరుగనుంది. ఎన్నో ఏళ్ల తర్వాత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ను వచ్చే ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురావడానికి నారి శక్తి వందన్ అభియాన్ (మహిళా రిజర్వేషన్ బిల్లు)పై లోక్‌సభలో శుక్రవారం ఓటింగ్ జరుగనుంది. ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి కావడంపై లోక్ సభలో ప్రతిపక్షాల వైఖరి ఎలా ఉంటుందనేని ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పటికే రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించగా.. నేటి సాయంత్రానికి బిల్లుల భవితవ్యం స్పష్టం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానం ఇవ్వనునున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో బిల్లులపై ఓటింగ్ జరుగనుంది. లోక్‌సభ తో పాటు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఈ సమావేశాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. 2023 లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ, అది కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడి ఉన్నందున ఇంకా అమలులోకి రాలేదు. 2029 లోక్ సభ ఎన్నికలకు ముందే దీనిని అమలు చేయాలని కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ బిల్లులపై గురువారం లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. మహిళా బిల్లు (Women Bill)కు అన్ని రాజకీయపార్టీలు బేషరతుగా మద్దతు ఇవ్వాలని లోక్ సభలో ప్రతిపక్షాలను ప్రధాని మోదీ కోరారు. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమం, ఈశాన్యం ఏ ప్రాంతం మీద తమకు వివక్ష లేదని స్పష్టం చేశారు. మహిళా బిల్లును సాంకేతిక కారణాలు చూపించి కొన్ని పార్టీలు వ్యతిరేకించడం సరికాదన్నారు. ఈ బిల్లు ఎవరిపట్ల వివక్ష చూపించదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ బిల్లును పెండింగ్‌లో పెట్టుకొని పాపం మూటగట్టుకున్నారని.. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకొందామని చెప్పారు. మహిళలకు రాజ్యాధికారం ఉండొద్దా? అంటూ ప్రధాని ప్రశ్నించారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు పార్లమెంటులో ఎందుకు ఉండొద్దని వ్యాఖ్యానించారు.

లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లుపై సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజక వర్గాల పునర్విభజన వల్ల ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు 130 నుంచి 195కి పెరుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఏకరీతిన అన్ని రాష్ట్రాల్లో 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని చెప్పారు. ఏపీలో లోక్ సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతుందని చెప్పారు. తెలంగాణలో17 నుంచి 26 సీట్లకి పెరుగుతుందన్నారు.

మహిళా బిల్లుపై ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు రెండు వేర్వేరు అని చెప్పారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని.. కానీ డీలిమిటేషన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మహిళా బిల్లు విషయంలో మోతీలాల్ నెహ్రూ చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రధాని మోదీ (PM Modi).. కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఏమీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు డీలిమిటేషన్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2021 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని, ఈ డేటా అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>