కలం, బీబీనగర్: గ్రామాలతో పాటు తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar Reddy) స్పష్టం చేశారు. బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి నుంచి యాపగాని తండా వరకు రూ.3 కోట్లతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.
రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు..
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తండాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే, నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ నిబద్ధతతో ముందుకు సాగుతోందన్నారు.
నిరుద్యోగం, ఉద్యోగాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళా సంక్షేమ పథకాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ పీఏసీఎస్ ఛైర్మన్ పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

