కలం, ఖమ్మం బ్యూరో : గత ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుపై అధికారులు స్పందించి, మానవీయ కోణంలో చర్యలు చేపట్టారు. ఖమ్మం (Khammam) జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రాయల రమేశ్, సులోచన దంపతులు 20 ఏళ్ళ క్రితం ఖమ్మం నగరానికి వలస వచ్చారు. చిన్న కుమారుడు అజయ్ (18) బ్రెయిన్ ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమయ్యాడని, తమకు సొంత ఇల్లు లేని కారణంగా కిరాయి ఇండ్లు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి, ఆ కుటుంబం ఇళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు, ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం కలిగించేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించారు. ఈ విషయంలో ఖమ్మం (Khammam) అర్బన్ తహసీల్దార్ సైదులు, అల్లిపురంలోని డబుల్ బెడ్ రూంల సముదాయంలో బ్లాక్ నెంబర్ 5 నందు జి7 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తూ ఉత్తర్వులను బాధితులకు అందజేశారు. ప్రజల సమస్యలపై జిల్లా యంత్రాంగం చూపుతున్న చొరవకు జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

