కలం, ఖమ్మం బ్యూరో : ఈనెల 27న జరగనున్న భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం (Sri Rama Navami), 28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం (Bhadrachalam) సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగా ఈనెల 27వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలకు ప్రత్యేక పాసులు జారీ చేసి, రద్దీ తగ్గించే విధంగా పరిమిత సంఖ్యలోనే వ్యక్తులను అనుమతించాలన్నారు.
మిథిలా స్టేడియంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, వీవీఐపీలు, వీఐపీలు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, వారికి ప్రత్యేక లైజనింగ్ అధికారులను నియమించాలని సూచించారు. కళ్యాణం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులకు లంచ్ ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమం ముగిసిన తర్వాత పాత్రికేయుల సమావేశం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా సిద్ధం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సూచించారు.

