ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ స్కామ్

కలం, నల్లగొండ బ్యూరో: ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాత.. తీరా పంటను అమ్ముకుందామంటే క‌ష్ట‌న‌ష్టాలు క‌న్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకృతి పగబట్టి ఎండలతో ఉడికించేస్తుంటే.. మరోవైపు అధికారులు-మిల్లర్లు కుమ్మక్కై తూకం రూపంలో రైతు రక్తాన్ని పీల్చుతున్నారు. నల్లగొండ (Nalgonda) జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. మిల్లర్ల ఇష్టారాజ్యం రాజ్యమేలుతోంది. అసలు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పెద్ద కుంభకోణంగా మారుతోంది. క్వింటాకు 5 కిలోల ధాన్యాన్ని తాలు, అదనపు తూకం పేరుతో మిల్లర్లు దోచుకుంటుంటే.. దాన్ని అరికట్టాల్సిన అధికారులు మిల్లర్లకు వత్తాసు పలుకుతున్నారు. ఒకవైపు 43 డిగ్రీల భానుడి సెగ.. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల లేమి.. వెరసి నల్లగొండ జిల్లా రైతాంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇటీవల నకిరేకల్ నియోజకవర్గంలో బస్తాకు 5 కిలోల తూకం అదనంగా వేస్తే.. తాజాగా వెలుగుపల్లి ఎన్‌డీసీఎంఎస్ కేంద్రంలో జరుగుతున్న బహిరంగ దోపిడీని చూస్తుంటే.. అసలు జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది.

తూకం వెనుక మాయాజాలం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం ప్రతి బస్తాలో 40 కిలోల 600 గ్రాముల ధాన్యం ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. మిల్లర్ల ఒత్తిడితో అధికారులు ఒక్కో బస్తాకు 42 నుంచి 45 కిలోలకు పైగా తూకం వేస్తున్నారు. నిబంధనల మేరకు ఒక్క బస్తా 40.6 కిలోలు ఉండాలి. కానీ ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 45 కిలోల వరకు తూకం వేస్తున్నారు. ఫలితంగా ప్రతి క్వింటాకు రైతు దాదాపు 5 కిలోల ధాన్యం కోల్పోతున్నారు. సగటున ఒక రైతు 100 క్వింటాళ్లు అమ్మితే.. అందులో 5 క్వింటాళ్ల సొమ్మును (దాదాపు రూ.10 వేలకు పైనే) ఉచితంగా మిల్లర్ల పాలు చేయాల్సి వస్తోంది. ఈ కుంభకోణంలో అధికారుల పాత్ర విమర్శనాత్మకంగా మారింది. తూకంలో తేడాలను ప్రశ్నిస్తే.. కాంటా పెట్టం.. మీ ధాన్యం తీసుకోమంటూ మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు బెదిరింపులకు దిగడం దారుణం. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో చేతులు మారాయనే ఆరోపణలు లేకపోలేదు.

కనీస వసతుల్లేవ్..

ఒకవైపు 43 డిగ్రీల ఎండలతో రైతులు అల్లాడుతుంటే.. కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. కాంటాల కోసం గంటల తరబడి వేచి చూసే రైతులకు గుక్కెడు నీరు ఇచ్చే దిక్కు లేదు. ఎండ నుంచి ధాన్యాన్ని, తనను తాను రక్షించుకోవడానికి సరైన షెడ్లు లేవు. 43 డిగ్రీల ఎండలో రైతులు తమ ధాన్యాన్ని ఆరబోయడానికి, తాలును వేరు చేయడానికి ట్రాక్టర్లు, జేసీబీలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీని వల్ల డీజిల్, కిరాయిల రూపంలో రైతులకు అదనంగా వేల రూపాయల భారం పడుతోంది. పండించిన పంటలో పెట్టుబడులు పోను, చేతికి చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. కౌలు ధరలు పెరగడం, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్ని తాకడం, పెరిగిన కూలీల ఖర్చులతో ఇప్పటికే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. చివరగా వచ్చిన పంటను అమ్ముకునే సమయంలో ఇలాంటి కోతలు పెట్టడం వల్ల రైతులకు మిగిలేది అప్పులే.

వెలుగుపల్లి కేంద్రంలో తాలు పేరుతో భారీ కోతలు..

వెలుగుపల్లి ఎన్‌డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తాలు ఉందనే సాకుతో అధికారులు క్వింటాకు కిలోల కొద్దీ ధాన్యాన్ని కట్ చేస్తున్నారు. పక్కనే ఉన్న ముషంపల్లి వంటి కేంద్రాల్లో లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని అబద్ధాలు చెబుతూ.. మధ్యవర్తులు, అధికారులు కలిసి రైతుల్ని దగా చేస్తున్నారని క్షేత్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో యూరియా అందకపోవడం వల్లే ధాన్యంలో తాలు వచ్చిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం కేంద్రాల్లోనే పేరుకుపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>