కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కార్మికులు తీసుకున్న సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ పని చేస్తోందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని.. ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు హడావిడిగా ఈ అంశాన్ని ముందుకు తీసుకువచ్చిందని పొన్నం తెలిపారు. కమిటీ ఏర్పాటయ్యాక కొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఆ తరువాత లోకసభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా కోడ్ అమలులో ఉండటం వల్ల ఈ అంశంపై సమగ్రంగా ముందుకు వెళ్లడం ఆలస్యమైందని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి, ఆర్టీసీ సేవలను బలోపేతం చేశామన్నారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇది సంస్థకు మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని చెప్పారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. గతంలో రూ.1,205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని గుర్తు చేశారు. అలాగే రూ.690 కోట్లుగా ఉన్న CCS బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని.. త్వరలోనే వారు విధుల్లోకి రానున్నారని తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ జేఏసీ సోమవారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. 21న అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపేస్తామని, 22న తెల్లవారుజాము నుంచే సమ్మెలోకి వెళ్తామని వెల్లడించింది.

