కలం, నకిరేకల్ : నకిరేకల్ (Nakrekal) పట్టణంలోని సబ్ స్టేషన్‌లో శుక్రవారం ఐఎన్‌టీయూసీ 327 జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచే ప్రయత్నం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
అలాగే ప్రజలను నూనె వాడొద్దని, బంగారం కొనొద్దని చెప్పడం ప్రధానమంత్రికి తగదని వ్యాఖ్యానించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని.. ముఖ్యంగా విద్య, వైద్యం, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నల్గొండ డివిజన్ అధ్యక్షులు సమ్మిరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

