Mobile Popup Ad
Mobile Popup Ad

దోమలపై యుద్ధం: మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

కలం, వెబ్​ డెస్క్​ : హైడరాబాద్ నగరంలో విజృంభిస్తున్న దోమల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరవాసుల నుంచి అందుతున్న వరుస ఫిర్యాదులపై స్పందించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా 99 రోజుల కార్యాచరణ సమీక్షలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన దోమల సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న మంత్రి, ఎంటమాలజీ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

దోమల నివారణకు శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ జియో ట్యాగింగ్ ద్వారా నిఘా ఉంచాలని తెలిపారు. గత మూడేళ్ల డేటా ఆధారంగా డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదైన వార్డులు, పీహెచ్‌సీ పరిధుల్లో మైక్రో ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, స్లమ్​ ఏరియాల్లో ఫాగింగ్, రసాయనాల పిచికారీ ముమ్మరం చేయాలని, దోమల లార్వాను నాశనం చేసేందుకు చెరువుల్లో ఆయిల్ బాల్స్, చేపలను వదలాలని మంత్రి సూచించారు.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి వారం డ్రై డే నిర్వహించి నీటి నిల్వలను తొలగించాలని మంత్రి పిలుపునిచ్చారు. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రభావిత ప్రాంతాల్లో 100 శాతం జ్వరం సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఆదివారం 10 నిమిషాలు దోమల నివారణకు కేటాయించేలా మీడియా ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>