కలం, కరీంనగర్ బ్యూరో: సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ‘గల్ఫ్ కాంగ్రేస్’ ప్రతినిధి సుతారి సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వారి ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు తెలిపారు.
అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాలను పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

