కలం, నాగర్ కర్నూల్ : నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల (NHM Employees) ప్రతినిధులు గురువారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ని కలిసి, గత 24 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెతో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం తదితర న్యాయమైన డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించారు. “మీ తరఫున నేను వకాల్తా పుచ్చుకొని మీ సమస్యలపై మాట్లాడతాను. ఎవరూ అధైర్యపడవద్దు. మీ సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్య శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతాను. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో కూడా ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను తప్పకుండా ప్రస్తావిస్తాను” అని భరోసా ఇచ్చారు.
మంత్రి సానుకూల స్పందనతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. గత 24 రోజులుగా ఉద్యోగ భద్రత, కుటుంబాల భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఎఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మంత్రి చొరవ చూపడం పట్ల ఎన్హెచ్ఎం జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల పక్షాన నిలిచి, వారి సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకి నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల ఎన్హెచ్ఎం జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు పరశురామ్, సభ్యులు గోపి, మంజుల, హరి సురేష్, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

